ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
4 రోజుల భారత పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్
ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన
భారతీయ వస్త్రధారణలో వాన్స్-ఉష పిల్లలు
తొలిరోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందు ఇచ్చిన ప్రధాని
పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలీకలు ఇచ్చిన ప్రధాని
నేడు, రేపు జైపూర్, ఆగ్రాల సందర్శన, అట్నుంచే అమెరికాకు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం దిశగా భారత్, అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు స్వాగతించారు. సోమవారం వారిద్దరూ ప్రధాని నివాసంలో ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం మోదీ వాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు. చర్చల సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్ ఈ ఏడాదే ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ, వాన్స్ అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ సమస్యను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని మోదీ, వాన్స్‌లు వ్యక్తం చేశారు. ట్రంప్ తలపెట్టిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ లాంటిదే తాను తలపెట్టిన వికసిత భారత్ అని మోదీ గుర్తు చేశారు. తన కుటుంబం పట్ల మోదీ కనబరచిన ఆదరాభిమానాలకు వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రజలతో స్నేహం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉండే సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. వాన్స్ తన కుటుంబం, అధికారులతో కలిసి ఎయిర్‌ఫోర్స్ 2 విమానంలో ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలో దిగారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఆయనతోపాటే వచ్చిన కుమారులు ఎవాన్(8), వివేక్(5), కుమార్తె మిరాబెల్(4) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అబ్బాయిలు కుర్తా పైజామా వేసుకోగా, కుమార్తె నీలాకుపచ్చ అనార్కలీ డ్రెస్‌లో మెరిసింది. రాగానే వాన్స్ కుటుంబం యమున ఒడ్డున ఉన్న అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయం తన పిల్లలకు బాగా నచ్చిందని వాన్స్ చెప్పారు. వాన్స్ కుటుంబం జన్‌పథ్ లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రియల్ ఎంపోరియంను సందర్శించారు. కాగితం గుజ్జు బొమ్మలు, తేనె, టీ పొడులు కొన్నారు.
అనంతరం వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు దేశాల అధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉండాల్సిన అంశాలపై చర్చించారు. వాన్స్ కుటుంబం సాయంత్రం రాగానే మోదీ తన ఇంటిని, తోటను పిల్లలకు తిప్పి చూపించారు. వాన్స్ పిల్లలు ఆసక్తిగా అనేక ప్రశ్నలు వేస్తూ మోదీతో మాట్లాడారు. ఆయన ఓపికగా వారికి సమాధానం ఇచ్చారు. మోదీ ఇచ్చిన నెమలి ఈకలను పిల్లలు సంతోషంగా తీసుకున్నారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరిటన్ హోటల్‌లో బస చేస్తున్న వాన్స్ కుటుంబం రాత్రి ప్రత్యేక విమానంలో జైపూర్ పర్యటనకు వెళ్లింది. అంబర్ ఫోర్ట్‌ను సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా వాన్స్ 23న ఆగ్రాను సందర్శించనున్నారు. తిరిగి జైపూర్ వచ్చి అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళతారు. అమెరికా ఉపాధ్యక్షుడి రాకతో ఢిల్లీలో భద్రతను భారీ ఎత్తున పెంచారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా వాన్స్‌కు ఇదే తొలి భారత పర్యటన. ఆయనకు ముందు జో బైడెన్ ఉపాధ్యక్ష హోదాలో 2013లో భారత్‌లో పర్యటించారు. కాగా, క్యాథలిక్ క్రైస్తవుడైన జేడీ వాన్స్ ఆదివారం వాటికన్ సిటీలో అనారోగ్యంగా ఉన్న పోప్ ప్రాన్సి్‌సను కలిశారు. ఆయన ఢిల్లీకి వచ్చేలోపు పోప్ మరణవార్త వెలువడింది. దాంతో వాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య
SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు
Updated Date – Apr 22 , 2025 | 03:52 AM