ఇంటర్నెట్ డెస్క్: నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’ (Thandel). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఆయన పంచుకున్న ఆసక్తికర సంగతులివీ..
‘కార్తికేయ 2’ అనుభవంతో..
‘‘నా గత చిత్రం ‘కార్తికేయ 2’ అనుభవం ‘తండేల్’కు బాగా ఉపయోగపడింది. నేనెప్పుడూ అనుకున్న బడ్జెట్‌ను దాటి సినిమా చేయను. ఈ మూవీ విషయానికొస్తే.. రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూర్తయింది. తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్ చేసేందుకు మళ్లీ డి.మత్స్యలేశం వెళ్లాం. ఇంకా ఏం జరిగింది? అని అక్కడి వారిని అడగ్గా సముద్రంలో చోటుచేసుకున్న తుపాను, ఆ సమయంలో మత్య్సకారుల సమయస్ఫూర్తి గురించి వివరించారు. అప్పటికే పూర్తయిన కథకు తగ్గట్టు బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా.. ఇలాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని భావించా. అదే విషయం చెబితే నిర్మాతలు అంగీకరించారు. ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.18 కోట్లు బడ్జెట్ అయింది. లైవ్ లొకేషన్ (సముద్రం)లో, స్టూడియోలో, మినియేచర్, వర్చువల్‌గా సన్నివేశాలు చిత్రీకరించాం. ఎమోషన్ ఉంటుంది’’
తదుపరి చిత్రాలు..
‘‘తండేల్’ రిలీజ్ తర్వాత సూర్యతో సినిమా చేయబోతున్నా. ఇప్పటికే ఆయన్ను కలిసి రెండు కథలు చెప్పా. రెండింటిలో ఏదో ఒకటి ఖరారైతే దాన్ని డెవలప్ చేయాలి. మరోవైపు, ఓ కథను.. నిర్మాత అల్లు అరవింద్ హిందీ హీరోతో చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీటితోపాటు ‘కార్తికేయ 3’ కూడా తెరకెక్కిస్తా’’ అని తెలిపారు. గతంలో నాగార్జునతో పోలీస్ స్టోరీతో ఓ సినిమా చేయాలనుకున్నానని, ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించానని, అనివార్య కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదన్నారు.