కుటుంబంతో సహా భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని కలిశారు.
ఇంటర్నెట్ డెస్క్: కుటుంబంతో సహా భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని కలిశారు. ఈ సందర్భంగా దిల్లీలోని 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసానికి విచ్చేసిన జేడీ వాన్స్ దంపతులకు మోదీ సాదర స్వాగతం పలికారు. తన నివాసం పరిసరాల్లో వారితో కలిసి కలియతిరిగారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలను ముద్దు చేస్తూ సరదాగా ముచ్చటిస్తూ గడిపారు. వారికి నెమలి పింఛాలను అందజేశారు. వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌తోనూ మాట్లాడారు. తన నివాసంలో జరిగిన భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని షేర్ చేశారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) దంపతులు దిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలు మీడియా దృష్టిని ఆకర్షించారు. కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించారు. అనంతరం వారు దిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ట్రంప్ టారిఫ్ దూకుడు వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.